Monday 18 July 2016

భయానక ప్రదేశాలు -1






కనిపించేవన్నీ నిజాలు కాదు. కనబడనివన్నీ అబద్దాలు కాదు. కనిపించడం లేదు అనే చిన్నకారణంతో మనం పీల్చే గాలిని విస్మరించగలమా ? నీలం రంగులో కనిపిస్తుంది కదా అని లేని శూన్యాన్ని( ఆకాశాన్ని ) ఉందని తాకగలమా ? అనంత విశ్వంలో మనకు తెలియని విషయాలెన్నో ఉన్నాయి ! మన చుట్టూ కనిపించే/ జరిగే విషయాల్లో సైతం మనకు తెలియని మర్మం దాగి ఉండొచ్చు. చిన్నటి దీపం వెలుగులో కనిపించే దాన్నే ప్రపంచమని నమ్మడం వెర్రితనమే అవుతుంది. వెలుగు ఆవల ఉన్న చీకటి లో ఏం దాగుందో ఎవరికి తెలుసు? కొన్ని సార్లు శాస్త్రవేత్తలు సైతం తర్జనభర్జనలై తేల్చలేకపోయిన అంశాలెన్నో మనముందు ప్రశ్నార్దకంతో నిలిచి ఉన్నాయి. సందిగ్ద ప్రశ్నల్లో ఒకటి .. “దేవుడుదెయ్యంఉనికి !
గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు వాద ప్రతివాదనలు చేస్తూనే ఉన్నారు. దేవుడి మాట అటుంచితే, దెయ్యాల ఉనికిపై సైతం రమరమిగా పై వాదనలే తరుచూ వినిపిస్తున్నాయి. దెయ్యాలు ఉన్నాయో లేదో ప్రక్కనపెడితే ..వాటికి సంబందించిన విషయాలు ఎప్పటికీ వినూత్నంగానూ ఆశ్చర్యగొలిపేలాగానూ ఉంటాయి. విషయంలోనైనా మనం ఆసక్తిని కోల్పోతామేమో గానీ, దెయ్యం అనే కాన్సెప్ట్ ఉన్న చిన్న విషయమైనా మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తూ పూర్తిగా కట్టి పడేస్తుంది. అటువంటి కథలతో ముడిపడిన భారత దేశంలోని కొన్ని భయానక ప్రాంతాలను పరిచయం చేయడమే వ్యాస ముఖ్య ఉద్దేశం..సదరు ప్రాంతాల్లో దెయ్యాల ఉనికి ఉందో లేదో గానీ..ప్రజల నోళ్ళల్లో మాత్రం క్రింది ప్రాంతాలు దెయ్యాలు ఉన్నాయి అనే భ్రమలతో(?) చాలా ఫేమస్ అయ్యాయి. మరి అలాంటి కొన్ని ప్రాంతాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
టన్నల్ నెం.103 లో ఆయన ఇంకా ఉన్నాడా ? :
కల్నల్ బారోగ్ అనే ఇంజినీర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి టన్నల్ నెం.103 ని షిమ్లా వెళ్లేదారిలో నిర్మించాడు. నిర్మించిన కొన్నాళ్ళకే అతను అనుకోకుండా చనిపోయాడు . అకాల మరణాన్ని జీర్ణించుకోలేని కల్నల్ తను ఎంతో ప్రేమగా కట్టుకున్న రైల్వే టన్నల్ లోనే ఉంటూ సేదతీరుతున్నాడని అంటారు. టన్నల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు దీని సృష్టికర్త బారోగ్ రూపం చాలా సార్లు తమకు కనిపించిందని వేరు వేరు ప్రయాణికులు సైతం చెప్పడం గమనార్హం . వారి వాదనకు బలం చేకూర్చినట్లుగానే ఓసారి టన్నల్ మూసేయాలని ప్రభుత్వం మెటల్ డోర్ చేసి ప్రవేశద్వారంలో పెట్టినా.. మరుసటి రోజే అది విరిగిపోయింది. దాంతో ఇక్కడ ఇంజినీర్ ఆత్మ వుందని అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. కానీ, ఆత్మ ఇప్పటివరకు ఎవరికీ కీడు చేయకపోవడం విశేషం.
భంగ్రా ఫోర్ట్ లోకి రాత్రి వేళల్లో నో ఎంట్రీ :
ఇది రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఉన్నది. హాంటెడ్ ప్రదేశం గురించి అనేక కథలు ఉన్నాయి. ఏవి నిజమో చెప్పలేం గానీ, పదిహేడవ శతాబ్దంలో నిర్మితమైన కోటలో చాలా మంది వివిధ కారణాలతో ప్రాణాలు విడిచి పిశాచాలుగా మారారంట ! రోజు టూరిస్టుల్లో ఒకాయన కాస్త పొద్దుపోయాక కోట నుండి బయటకి వస్తుంటే .. దూరంగా ఒక చిన్న పిల్లాడు కోటలో ఉన్న తలుపులు లేని గదిలో మూలాన కూర్చొని ఏడుస్తూ సదరు వ్యక్తిని లోపలి రమ్మన్నాడంట ! బాలుడు ఎవరో చూద్దాం అని దగ్గరికి వెళ్ళిన టూరిస్టు కు బాలుడు ఒక పండు ముసలాయనలా కనిపించడంతో అవాక్కయి పరుగు తీసాడంట! ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి. ఇప్పటికీ, కొందరు వ్యక్తులు ( ఆత్మలు ) రోజూ రాత్రంతా కోటలో తిరుగుతూ అరుస్తారని స్థానికులు చెప్తారు. ప్రభుత్వం సమస్యలను నివారించేందుకు ప్రవేశద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డును సైతం ఉంచిందంటే ప్లేస్ ఎంత భీభత్సాన్ని సృష్టిస్తుందో అర్ధం చేసుకోండి.
డుమాస్ బీచ్ లో ఆటాడుకుంటున్న దెయ్యాలు :
గుజరాత్ లో ఉన్న అందమైన డుమాస్ బీచ్ కూడా హాంటెడ్ ప్రదేశంగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తరువాత రాత్రి పూట ప్రజలు బీచ్ ను సందర్శించటానికి వీలు లేదు. ఎందుకంటే అనేక మిస్సింగ్ కథలు బీచ్ చుట్టూ అల్లుకొని ఉన్నాయి. అలాంటి ఇలాంటి కథలు కావు మరి. మీరు మీ మిత్రులతో బీచ్ కి వెళ్తే..మీలో ఎవరో ఒకరు మిస్ అవడం ఖాయం. మిస్ అయిన వ్యక్తి కోసం మీ టీం వెతుకుతుండగానే తప్పిపోయిన వ్యక్తి కనిపించి మీ గ్రూప్ లో ఇంకో వ్యక్తి మిస్ అవుతాడు..చూడటానికి ఇది ఆటగా ఉన్నా ఇది అక్షరాలా నిజమని అనుభవించిన వారు చెప్తారు. బీచ్ ముందున్న ప్రదేశంలో చనిపోయిన వారిని కాల్చడం వల్ల వారి ఆత్మలు బీచ్ ని ఆట స్థలంగా మార్చుకున్నాయని కొందరు భావిస్తారు.
నగలు వేసుకున్న దెయ్యం :
బెంగుళూర్ నగరం సెయింట్ మార్క్స్ రోడ్ లో ఉన్న ఇంట్లో ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితిలో హత్య కు గురయ్యింది. సదరు మహిళకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. కానీ, హత్యానంతరం హంతకులు ఆమె నగలను అపహరిస్తూ వెళ్తున్న సమయంలో ఆత్మగా మారిన మహిళ వారిని చంపిందని చెప్తారు. కొన్నాళ్ళ తర్వాత ఎవరూ లేని ఖాళీ ఇంటిని కొందామని ఒక వ్యాపారి ఇంటికి వెళ్తే మహిళ దెయ్యమై తన అమూల్యమైన నగలను ఒళ్ళంతా సింగారించుకొని అతీంద్రియ కార్యకలాపాలు సాగిస్తూ, గట్టిగా ఏవో మంత్రాలు చదువుతూ వ్యాపారి వెంట పడిందంట! అప్పటినుండి ఇంటిని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు.
లిఫ్ట్ కోసం అడవిలో వెయిట్ చేస్తున్న ఆత్మలు :
ప్రదేశం ఢిల్లీ శివారులో ఒక ఆటవిక ప్రాంతంలో ఉంది. ఎక్కడెక్కడినుండో వచ్చిన ఆత్మలన్నీ తెలుపు చీర కట్టుకొని దారిన పోయే వాహనదారులని లిఫ్ట్ అడుగుతాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లిఫ్ట్ ఇస్తే..కొంత దూరం వరకు ప్రయాణించి ఆత్మలు మాయం అవుతాయి ! ఇవ్వకపోతే, మీ కంటే ముందే గాలిలో ప్రయాణించి అర కిలో మీటర్ ముందుగా రోడ్ ప్రక్కన నిలబడి మీ వాహనం రాగానే మళ్ళీ లిఫ్ట్ అడుగుతాయి . సారీ.. లిఫ్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అలాగే చేస్తాయి. మీరు అడవి దాటేంత వరకు ఇదే తంతు.

ఇవండీ! అత్యంత భయానక ప్రదేశాల్లో కొన్ని.. మీకు డౌట్ గా అనిపిస్తే మీరు ఒకసారి వెళ్లి రావచ్చు. వెళ్ళొస్తారేంటి ?