Monday 30 May 2016

చందమామ పై నివాసాలు





టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమం సామాన్యుల్లో సైతం కొత్త ఆశలను రేపుతుంది. నిన్న మొన్నటి వరకు రాత్రిళ్ళు పిల్లలకు గోరుముద్దలు తినిపించడానికి, కవుల కవిత్వాలకు, సినీ రచయితల యుగల గీతాల రచనలకు ఒక వస్తువుగా ఉపయోగపడిన చల్లని రేడు చంద్రుడు..ఇప్పుడు మానవ ఆవాసాలకు ఆథిత్యం ఇవ్వబోతుండటం నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న అంశం! నెదర్లాండ్స్ లోని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం..ఇంకో పది, పదిహేనేళ్ళలో చంద్రునిపై మానవ నివాసాలకు అనుగూణంగా కాలనీలు సైతం ఏర్పాటుచేయుటకు ప్రయత్నాలు సాగవచ్చని, చంద్రునిపై ఇదివరకే కనుగొన్న లావా ట్యూబ్స్ గురించి తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలు బయటపడటంతో తామీ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు.
సౌరకుటుంబంలో ప్రాణికోటికి ఆలవాలమైన భూమికి ఉన్న ఏకైక సహజ సిద్ధ ఉపగ్రహం చంద్రుడు. 1969, జూలై 20న తొలిసారిగా చంద్రునిపై అడుగీడినది మొదలు ఆ జాబిల్లి పొదరింట్లో ఉన్న అనేకానేక విశేషాలను తెలుసుకుందామని మనిషి అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా చంద్రునిపైన నివాసానికే సిద్దమవుతున్నాడు. మనిషి ఆలోచనలకు తగ్గట్లే, తాజా పరిశోధనల్లో వెల్లడైన విషయాలను చూస్తే చంద్రునిపై నివాసముండే రోజు ఏంతో దూరంలో లేదని అనిపిస్తుంది.
పగలు వేడి మంట – రాత్రి చలితో తంటా !
చంద్రునిపై నివాస ఏర్పాటుకు సంబందించిన విషయాలు తెలుసుకునే ముందు అక్కడి వాతావరణ పరిస్థితులు ఎంత క్లిష్టతరమైనవో తెలుసుకోవాలి. చంద్రుడు భూమికి ఉపగ్రహమైనప్పటికీ అక్కడి ఉపరితల వాతావరణం భూమికి మళ్లే సాధారణంగా ఉండదు. ప్రస్తుతం అక్కడ భౌతిక స్థితిలో ఆక్సీజన్, నీరు లేనందున సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత, ఇన్ఫ్రారెడ్ మొదలగు కిరణాలను నిరోధించే ఓజోన్ పొర చంద్రుడిపై లేదు. ఈ కారణం చేత అక్కడ విపరీతమైన రేడియేషన్ ఆవరించి ఉంది. అంతే కాదు, అక్కడి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం మన ఊహకు కూడా అందనంతగా ఉంది. అక్కడ పగలు దాదాపు 123 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా, రాత్రిళ్ళు సుమారు మైనస్ 233 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే, పగలు భగ భగ మండే వాతావరణం, రాత్రి గడ్డకట్టించే చల్లదనం అన్న మాట. ఇన్ని అవాంతరాలను దాటి చంద్రునిపై మనిషి నివాసం ఏర్పరచుకోవడం  అనేది కల్ల అనుకుంటున్న సమయంలో.. జపాన్ కి చెందిన కగుయా వ్యోమ నౌక 2008 సంవత్సరంలో చంద్రునిపై సొరంగం లాంటి ఒక లోయను ( లావా ట్యూబ్ ) కనుక్కుంది. ఆ వ్యోమ నౌక పంపిన ఛాయా చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ టన్నెల్  80 మీ. లోతు, 65 మీ. వెడల్పు, 25 మీ. మందంతో గడ్డకట్టిన లావాను కవచంలా కలిగి ఉండటం గమనించారు. ఈ కవచం చంద్రునిపై ఉన్న విపత్కర వాతావరణ పరిస్థితులనుండి రక్షించగలదని భావించి పరిశోధనలను చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పరిశోధనలు ఫలితాలు చంద్రునిపై నివాసం సాధ్యమే అన్న ఆశలను మళ్ళీ చిగురింపజేస్తున్నాయి.
లావా ట్యూబ్ ఇదే మనకు రీసెర్చ్ ల్యాబ్ :
జపాన్ వ్యోమ నౌక కనిపెట్టిన సొరంగం ( లావా ట్యూబ్ ) కొత్త పరిశోధనలకు ఊతం యిస్తుంది. ఇటువంటి టన్నెల్స్ చందమామపై  చాలా ఉన్నాయని ఆ నౌక పంపిన చిత్రాలు రుజువు చేస్తున్నాయి. చంద్రునిపై నివాస  ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారిన అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి మనుషులను ఈ ట్యూబ్స్ రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ఈ ట్యూబ్స్ మందమైన రక్షణ కవచం బయటి రేడియేషన్ ని లోపలకి రాకుండా అడ్డుకునే స్వభావం కలిగి ఉందని, పగటి పూట వేడిని, రాత్రి పూట చల్లదనాన్ని ఈ సొరంగం అడ్డుకుంటుందన్న విషయం తమ పరిశోదనల్లో వెల్లడైందని.. అలాగే,  చంద్రునిపై ఉన్న మట్టిలో ప్రాణవాయువుకు సంబందించిన దాతువులున్నట్లు తాము గుర్తించామని జపాన్, అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే, భారతీయ నౌక చంద్రయాన్ – 1 చంద్రునిపై నీటి జాడలను కనుగోవడం తమ పరిశోధనలకు మరింత భరోసాను ఇచ్చిందని వారు వ్యాఖ్యానించారు. అయితే, సూర్యుని కాస్మిక్ కిరణాలు చంద్రుని ఉపరితలాన్ని తీక్షణంగా తాకడం, చంద్రునిపై ఉన్న బలహీన మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ తదితర అంశాలు చందమామపై ఆవాసాల ఏర్పాటుకు కొత్త సవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటిని కూడా ఎదురుకోవడానికి రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తయారీలో శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలై ఉన్నారు.   
యూరప్ ప్రభుత్వం మూన్ 20-20, మూన్ 20-30 పేరిట ప్రయోగాలను ప్రారంభిస్తే, అమెరికా 2020 సంవత్సరంలో  మరోమారు మానవుడిని చంద్రునిపైకి పంపి అక్కడి వనరులను, ఖనిజ నిక్షేపాల సమాచారాన్ని రాబట్టి 2025, 2030  సంవత్సరంలోగా అక్కడ కాలనీలను ఏర్పాటు చేసి అక్కడి నుండే పరిశోదనలను సాగించాలని యోచిస్తుంది. మన భారత దేశం సైతం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన డీప్ స్పేస్ నెట్‌వర్క్ సహకారం తీసుకొంటూ చంద్రుని దక్షిణ ప్రాంతంలోని పదార్థాల స్వభావం, నీటి లభ్యత వంటి పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్ – 2 ప్రయోగాన్ని 2017 చివర్లో గానీ, 2018 మొదట్లో గానీ ప్రయోగించుటకు సంసిద్దమవుతుంది.దీని ద్వారా చంద్రుని పై జరిగే లేటెస్ట్ న్యూస్ క్షణాల్లో తెలిసే వీలుంది. శాస్త్రవేత్తల పరిశోదనలు సరైన ఫలితాలనిస్తుండటంతో త్వరలోనే చంద్రునిపై ఇల్లు కట్టుకొనే ఆలోచనలో కొందరుంటే, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని సంస్థలు చంద్రునిపై ప్లాట్ల అమ్మకాన్ని ప్రారంభించడం విశేషం.




చందమామ గురించి ఆసక్తికర విశేషాలు :
చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు!
చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి, నీరు లేకపోవడమే. అవి రెండూ ఉన్నట్లయితే, అక్కడి మట్టి కదిలేది! కాలి ముద్రలు చెరిగిపోయేవి. జాబిల్లిపై నిరంతరం అతిసూక్ష్మస్థాయిలోని ఉల్కారేణువులు కురుస్తూనే ఉన్నా.. అవి పేరుకుపోయి అడుగు జాడలు చెరిగిపోవడం ఇప్పట్లో జరగదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
చంద్రునిపై మచ్చలు కనబడటానికి కారణం !
చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. అయస్కాంత క్షేత్ర  బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని శిలలు నల్లగాను, సూర్యుడి నుండి వచ్చే వేడి గాలులవల్ల ప్రభావితం చెందిన అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగానూ కనిపిస్తాయి.
భూమికి దూరం అవుతున్న చంద్రుడు :
ప్రతీ సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెం. మీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోదనల్లో తేలింది. ఇది ఇలాగే కొనసాగితే, భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత  47 రోజులు తీసుకుంటాడంటా!
ఇక్కడ 60 కిలోల మనిషి, చంద్రుడిపై 10 కిలోలే!  :
భూమితో పోలిస్తే చంద్రుని పై నుండి రాకెట్లను అంతరిక్షంలోకి పంపడం చాలా చౌక. దీనికి కారణం లేకపోలేదు. భూమి గురుత్వాకర్షణ శక్తి ఆరు వంతులుగా అనుకుంటే, చంద్రుని ఆకర్షణ శక్తి ఒక వంతుకన్నా తక్కువ. అంటే, భూమి పైన అరవై కిలోలున్న మనిషి, చంద్రునిపై పది కిలోలు మాత్రమే తూగుతాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇందనం, దాని వ్యయం తగ్గుతున్నట్లే కదా! 

For telugu news online please Download NewsDistill app from Google play store

Wednesday 25 May 2016

కనుమరుగవుతున్న బాల్యం ( ప్రపంచ బాలల మిస్సింగ్ / అపహరణ దినం .. మే 25 సందర్బంగా )


జంక్షన్‌లో సిగ్నల్ పడింది మొదలు . .  ట్రాఫిక్కు అడ్డం పడుతు మరీ.. బిక్షాటన చేసే  పిల్లలను ఒక్కసారి తెరిపారా చూస్తే,  ‘యాచక వృత్తిలోకి దిగుతున్న పసివాళ్లంతా ఎక్కడి నుంచి వస్తున్నారు..?అనే సందేహం కలగక  మానదు.  పెద్ద సంఖ్యలో పిల్లలను బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాల ఆగడాల వల్లే వీరి బాల్యం చిద్రమవుతుందన్న సంగతి అప్పుడు గానీ బోదపడదుఒక్క యాచక వృత్తే కాదుఇంట్లో నుండి దురదృష్టవశాత్తు తప్పిపోయిన  చిన్నారులను అపహరించి  వారి అవయవాల కోసం క్రిమినల్‌ గ్యాంగ్‌లకు అమ్మడంఅక్రమంగా దత్తతలు తీసుకునే కుటుంబాలకు పసి మొగ్గల్ని  విక్రయించడంవిదేశాల్లో లేదా స్వదేశంలోనే  వేశ్యా గృహాలకు అమ్మి వేస్తూ డబ్బులు దండుకోవడం వంటి హీనాతిహీన కార్యాలను అపరిచిత వ్యక్తులు/ ముఠాలు  చేస్తున్నాయి . అంతటితో ఆగకుండాఅనేక విధాలుగా పిల్లల్ని హింసిస్తూ మెడికల్ పరీక్షలకు బలిపశువులుగా ఉపయోగించడం, ఇళ్ళల్లో వెట్టి చాకిరీ చేయించడమో, పరిశ్రమలలో బాల కార్మికులుగానో  చేస్తూ  పాలనురుగులు చిందాల్సిన మోములపై కన్నీటిదారలను కార్పిస్తున్నారు.   

ఇటీవల చెన్నైలో రోడ్డు పక్కన నడుస్తున్న చిన్నారిని దుండగులు కారులో ఎత్తుకెళ్ళుతున్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు  యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. వార్త బ్రేకింగ్ న్యూస్ లా దేశమంతా వ్యాపించింది. ఒక్క చెన్నై నగరంలోనే కాదు. యావత్ భారతావని అంతటా ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుండటం విచారకరం. దేశం మొత్తమీద ఏటా సుమారు 30 వేలకు పైగానే బాలలు అదృశ్యం అవుతున్నట్లు ఎన్సిఆర్బి ( నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ) – భారత ప్రభుత్వం ) లెక్కలు స్పష్టం చేస్తున్నా.. సంఖ్య వాస్తవ దూరమని స్వచ్చంద సంస్థల లేటెస్ట్ అప్డేట్స్  నిగ్గుతెలుస్తున్నాయి. స్వచ్చంద సంస్థల  సర్వేలను నిజం చేస్తూ.. సాక్షాత్తు, హోం మంత్రిత్వ శాఖ వారు 2014 పార్లమెంట్ సమావేశాల్లోదేశంలో ఏటా కనీసం  లక్షమంది చిన్నారులు కనిపించకుండా పోతున్నారని చెప్పడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. సగటున ప్రతి రోజూ కనీసం రెండొందలకు పైగా పిల్లలు జాడ లేకుండా పోతున్నారని హోం శాఖ వారు నివేదించారు. ఒక్క నేవీ ముంబయిలోనే ఏటా సుమారు వెయ్యి  మంది చిన్నారులు అదృశ్యం అవుతున్నారంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అస్సాం వంటి చిన్న రాష్ట్రంలో సైతం ఏటా దాదాపు నాలుగువేల మంది పిల్లలు కనిపించకుండాపోతున్నారు.

వాస్తవ ముఖ చిత్రం :

నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో వారు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా  2012లో 18,266 మంది చిన్నారుల జాడ తెలియకుండా పోగా,  2013 లో అపహరణ / తప్పిపోయిన చిన్నారుల సంఖ్య 28,167 గా ఉంది.  2014 కి తప్పిపోయిన/ అపహరణకు గురైన చిన్నారుల  సంఖ్య 37,854గా తేలిందని సదరు సంస్థ నివేదికను ఇచ్చింది. గణాంకాలు కేవలం కేసు ఫైల్ అయిన చిన్నారులవి మాత్రమే! అయితేలేటెస్ట్ న్యూస్ ప్రకారం  మిస్ అవుతున్న చిన్నారుల కేసులన్నీ ఫైల్ అవకపోవడం విషాదకరం . లెక్కన సగటున సంవత్సరానికి లక్షకు పైగా చిన్నారులు తప్పిపోవడము/ అపహరణల్లో  చిక్కుకోవడము జరుగుతుంది. ఇక  ఢిల్లీ,ముంబయికోల్‌కతపూణెహైదరాబాద్పాట్నా వంటి అనేక నగరాల్లో పిల్లలను అపహరించివారిచేత యాచన చేయించే ముఠాలు డజనుకు పైగా  ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల అపహరణలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు గతంలోనే పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యేటికేడూ తప్పిపోయిన చిన్నారుల్లో సగం మంది  ఆచూకీ కూడా లభించకపోవడం చూస్తే, పోలీసులు కిడ్నాప్ అవుతున్న చిన్నారుల రక్షణ చర్యలకు తీసుకుంటున్న నిర్ధిష్టమైన ప్రణాళికల్లో  ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రస్పుటమవుతుంది .. కొన్ని కేసుల్లో మాత్రమే పోలీసులు  ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం తప్ప, గ్రామీణ ప్రాంతాలుబడుగువర్గాలకు చెందిన పిల్లల విషయంలో అతీగతీ కనిపించడం లేదనేది కాదనలేని సత్యం. దేశవ్యాప్తంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలుడు /బాలిక అదృశ్యం అవుతున్నట్లు స్వచ్చంద సంస్థలు తేల్చాయి. పిల్లల అదృశ్యం కేసులు ఏటేటా పేరుకుపోతుండగాసగటున పాతిక శాతం కేసుల్లో మాత్రమే ఫలితాలు కనబడుతుండటాన్ని చూస్తే పిల్లల అపహరణ విషయంలో  విచారణ ప్రక్రియ ఎంత నత్తనడకన సాగుతుందో తెలుస్తుంది అన్నింట్లో వారే ..!

అదృశ్యం అవుతున్న పిల్లల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనను కలిగజేస్తున్న అంశం. పిల్లలను అపహరించే ముఠాలు అనేక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ముక్కు పచ్చలారని పసి మొగ్గలని బలిచేస్తున్నాయి. పిల్లలు పుట్టింది మొదలు . . అపహరణ ప్రహసనం దశల వారీగా కొనసాగుతుండటం విచారకరం. కొన్ని ప్రభుత్వప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రత సరిగా లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులను అపహరించి  పిల్లలు లేని దంపతులకు భారీ మొత్తాలకు కొందరు విక్రయించిన ఘటనలు అనేకం. ఇలా ఆరంభమైన వారి చర్యలు  యాచక వృత్తిలోకి బలవంతంగా చిన్నారులను దించడంఅవయవ వ్యాపారులకు పిల్లల్ని విక్రయించడంబాలికలైతే వ్యభిచార గృహాలకు తరలించడంఅయిదు నుండి పదిహేను  సంవత్సరాల వయసున్న చిన్నారులను కర్మాగారాల్లో బాలకార్మికులుగా చేర్పించడంఇళ్లలో పనివారిగా కుదర్చడం, అత్యంత ప్రమాదకరమైన బాణసంచాఆయుధాల తయారీలోనూ పిల్లలను వినియోగించడంతో పాటు వివిధ జంతువులపై టెస్టింగ్ కోసం ప్రయోగించే మందులను (మెడికల్ టెస్టింగ్) పిల్లలపై ప్రయోగించే అమానుష అత్యంత  విపత్కర చర్యలతో కిడ్నాపర్ల  విన్యాసాలు ఉచ్ఛ స్థాయికి ఎగబాకుతున్నాయని అనేక స్వచ్చంద సంస్థలు  విచారం వ్యక్తం చేస్తున్నాయి.
కట్టుదిట్టమైన చర్యలే..వారి భవితకు రక్షణ !

తప్పిపోయిన చిన్నారులు అదే ప్రాంతంలో లేదా రాష్ట్రంలో ఉంటారని చెప్పలేం. తప్పిపోయిన/ అపహరణకు గురైన చిన్నారుల  కేసుల్లో నిజానిజాలను రాబట్టి,ఆచూకీ కనుగొనాలంటే వివిధ రాష్ట్రాల పోలీసులుఅధికారుల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలి. అపహరణకు గురయ్యే పిల్లలకు సంబంధించి అన్ని రాష్ట్రాలూ ఒకే తరహా చట్టాలను అమలు చేస్తేనే పిల్లలను రక్షించే గురుతర బాధ్యత సఫలీకృతం అవుతుందని గమనించాలి. చిన్నారులు అదృశ్యమైనట్లు ఫిర్యాదులొస్తే కేవలం మిస్సింగ్కేసులు నమోదు చేయడం తప్పవివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్న దాఖలాలు తక్కువే అనడానికి తప్పిపోయిన , రక్షించబడిన చిన్నారుల సంఖ్యలలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే తెలుస్తుంది. కిడ్నాప్ అయ్యాక,  ప్రాణాలు కోల్పోయి విగత జీవులైన  చిన్నారుల దేహాలు  లభించాక  కొన్ని కేసులు  వాస్తవాలు వెలుగు చూస్తుండటం మనసులను చివుక్కుపరచక మానదుకాగాపిల్లల కిడ్నాప్‌లను ఛేదించేందుకు పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్నినిఘా వ్యవస్థను, హెల్ప్‌ లైన్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసుపత్రుల్లోపాఠశాల వద్ద,  రైల్వే స్టేషన్లుబస్ స్టేషన్లలో, పార్కుల్లో, ఆట స్థలాల్లో, పిల్లలు సంచరించే చోట్లు మొదలగు ప్రదేశాల్లో  సిసి కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి లైవ్ న్యూస్   లాగా నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కేసులపై తరచూ సమీక్షలు జరిపికొత్త కోణంలో దర్యాప్తులను వేగవంతం చేస్తూ, స్వచ్చంద సంస్థల సాయాన్ని తీసుకుంటే  కొంతమేరకైనా పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. వ్యభిచార కేంద్రాలు,పారిశ్రామిక ప్రాంతాల్లో తరుచూ ఆకస్మిక దాడులు జరిపి నిందితులు, సూత్రదారులపై  కఠిన చర్యలను సత్వరం  తీసుకుంటే ఎంతోమంది బాలబాలికల వ్యధలను వెలుగులోకి తీసుకొచ్చిన వారవుతాము. దత్తత చట్టంపై చేస్తున్న  ప్రచారం అనుకున్న స్థాయిలో లేదనడానికి ప్రతీ సంవత్సరం జరుగుతున్న   శిశు అక్రమ విక్రయాల తంతే సాక్ష్యం. ఇకనుండైనా  దత్తత చట్టానికి తగిన ప్రచారం కల్పిస్తూనే, అక్రమంగా శిశువులను అమ్మేవారిపైనే గాకుండా కొనే వారిపై సైతం కఠిన శిక్షలు అమలుపరిస్తే  సంతానం లేని దంపతులు అక్రమ పద్ధతుల్లో శిశువులను కొనుగోలు చేసేందుకు సాహసించరు.



ఇప్పటికే కనిపించకుండాపోయిన పిల్లలను వెతికేందుకు పోలీసులు, ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. తప్పిపోయిన చిన్నారుల సమాచారాన్ని  పోలీసు వారికి అందించడం గానీ , ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ వారికి  అప్పగించడం గాని  , ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్చంద సంస్థల వాలంటీర్లకు చేరవేయడం గానీ చేయడం మన కనీస బాధ్యత.  కన్న తల్లి పెట్టే  గోరు ముద్దలు తింటూతండ్రి చెప్పే చందమామ కథలు వింటూ అపురూపంగా పెరిగే బాల్యాన్ని దూరం చేసుకొనికిడ్నాపర్ల చేతిలో చిత్ర హింసలతో మనసులుశరీరాలు గాయపరుచుకుంటున్న  చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిబిడ్డను కోల్పోయి గుండెలవిసేలా ఏడుస్తున్న కన్న తల్లిదండ్రులను ఓదార్చే బాధ్యత సగటు పౌరులుగా మనందరిపై ఉందన్నది కాదనలేని సత్యం. ప్రభుత్వాలు సైతం బాల బాలికల అపహరణ విషయంలో గట్టి చర్యలతో ముందుకెళ్తే లేత మోములపై చిరునవ్వులను కురిపించినవారవుతారు.
గగుర్పొడిచే నిజాలు :

·         పిల్లల ఆచూకీ పట్టుకోవడానికి రెండు రోజులు ఆలస్యమైనా  పిల్లలను దేశం దాటించే అవకాశాలుంటాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.

·         దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదుపొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా ఏటా వేలాది మంది బాలికలను ముంబయికోల్‌కతల్లోని వ్యభిచార గృహాలకు విక్రయిస్తూ అపహరణ ముఠాలు కోట్లను దండుకోవడం విచారకరం .

·         బాలల అక్రమ తరలింపు వ్యవహారం 90 శాతం మేరకు దేశీయంగా జరుగుతోంది. పది శాతం బాలల్ని విదేశాలకు తరలిస్తున్నారు.

·         ఏటా అపహరణకు గురవుతున్న చిన్నారుల్లో  కేవలం పాతిక శాతం కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలుగుతున్నారు.

·         అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) అంచనాల మేరకు భారత్‌లో 12.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది చిన్నారులను చట్టవ్యతిరేక పనుల్లో వినియోగిస్తున్నారు.