Monday 30 May 2016

చందమామ పై నివాసాలు





టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమం సామాన్యుల్లో సైతం కొత్త ఆశలను రేపుతుంది. నిన్న మొన్నటి వరకు రాత్రిళ్ళు పిల్లలకు గోరుముద్దలు తినిపించడానికి, కవుల కవిత్వాలకు, సినీ రచయితల యుగల గీతాల రచనలకు ఒక వస్తువుగా ఉపయోగపడిన చల్లని రేడు చంద్రుడు..ఇప్పుడు మానవ ఆవాసాలకు ఆథిత్యం ఇవ్వబోతుండటం నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న అంశం! నెదర్లాండ్స్ లోని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం..ఇంకో పది, పదిహేనేళ్ళలో చంద్రునిపై మానవ నివాసాలకు అనుగూణంగా కాలనీలు సైతం ఏర్పాటుచేయుటకు ప్రయత్నాలు సాగవచ్చని, చంద్రునిపై ఇదివరకే కనుగొన్న లావా ట్యూబ్స్ గురించి తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలు బయటపడటంతో తామీ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు.
సౌరకుటుంబంలో ప్రాణికోటికి ఆలవాలమైన భూమికి ఉన్న ఏకైక సహజ సిద్ధ ఉపగ్రహం చంద్రుడు. 1969, జూలై 20న తొలిసారిగా చంద్రునిపై అడుగీడినది మొదలు ఆ జాబిల్లి పొదరింట్లో ఉన్న అనేకానేక విశేషాలను తెలుసుకుందామని మనిషి అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా చంద్రునిపైన నివాసానికే సిద్దమవుతున్నాడు. మనిషి ఆలోచనలకు తగ్గట్లే, తాజా పరిశోధనల్లో వెల్లడైన విషయాలను చూస్తే చంద్రునిపై నివాసముండే రోజు ఏంతో దూరంలో లేదని అనిపిస్తుంది.
పగలు వేడి మంట – రాత్రి చలితో తంటా !
చంద్రునిపై నివాస ఏర్పాటుకు సంబందించిన విషయాలు తెలుసుకునే ముందు అక్కడి వాతావరణ పరిస్థితులు ఎంత క్లిష్టతరమైనవో తెలుసుకోవాలి. చంద్రుడు భూమికి ఉపగ్రహమైనప్పటికీ అక్కడి ఉపరితల వాతావరణం భూమికి మళ్లే సాధారణంగా ఉండదు. ప్రస్తుతం అక్కడ భౌతిక స్థితిలో ఆక్సీజన్, నీరు లేనందున సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత, ఇన్ఫ్రారెడ్ మొదలగు కిరణాలను నిరోధించే ఓజోన్ పొర చంద్రుడిపై లేదు. ఈ కారణం చేత అక్కడ విపరీతమైన రేడియేషన్ ఆవరించి ఉంది. అంతే కాదు, అక్కడి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం మన ఊహకు కూడా అందనంతగా ఉంది. అక్కడ పగలు దాదాపు 123 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా, రాత్రిళ్ళు సుమారు మైనస్ 233 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే, పగలు భగ భగ మండే వాతావరణం, రాత్రి గడ్డకట్టించే చల్లదనం అన్న మాట. ఇన్ని అవాంతరాలను దాటి చంద్రునిపై మనిషి నివాసం ఏర్పరచుకోవడం  అనేది కల్ల అనుకుంటున్న సమయంలో.. జపాన్ కి చెందిన కగుయా వ్యోమ నౌక 2008 సంవత్సరంలో చంద్రునిపై సొరంగం లాంటి ఒక లోయను ( లావా ట్యూబ్ ) కనుక్కుంది. ఆ వ్యోమ నౌక పంపిన ఛాయా చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ టన్నెల్  80 మీ. లోతు, 65 మీ. వెడల్పు, 25 మీ. మందంతో గడ్డకట్టిన లావాను కవచంలా కలిగి ఉండటం గమనించారు. ఈ కవచం చంద్రునిపై ఉన్న విపత్కర వాతావరణ పరిస్థితులనుండి రక్షించగలదని భావించి పరిశోధనలను చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పరిశోధనలు ఫలితాలు చంద్రునిపై నివాసం సాధ్యమే అన్న ఆశలను మళ్ళీ చిగురింపజేస్తున్నాయి.
లావా ట్యూబ్ ఇదే మనకు రీసెర్చ్ ల్యాబ్ :
జపాన్ వ్యోమ నౌక కనిపెట్టిన సొరంగం ( లావా ట్యూబ్ ) కొత్త పరిశోధనలకు ఊతం యిస్తుంది. ఇటువంటి టన్నెల్స్ చందమామపై  చాలా ఉన్నాయని ఆ నౌక పంపిన చిత్రాలు రుజువు చేస్తున్నాయి. చంద్రునిపై నివాస  ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారిన అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి మనుషులను ఈ ట్యూబ్స్ రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ఈ ట్యూబ్స్ మందమైన రక్షణ కవచం బయటి రేడియేషన్ ని లోపలకి రాకుండా అడ్డుకునే స్వభావం కలిగి ఉందని, పగటి పూట వేడిని, రాత్రి పూట చల్లదనాన్ని ఈ సొరంగం అడ్డుకుంటుందన్న విషయం తమ పరిశోదనల్లో వెల్లడైందని.. అలాగే,  చంద్రునిపై ఉన్న మట్టిలో ప్రాణవాయువుకు సంబందించిన దాతువులున్నట్లు తాము గుర్తించామని జపాన్, అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే, భారతీయ నౌక చంద్రయాన్ – 1 చంద్రునిపై నీటి జాడలను కనుగోవడం తమ పరిశోధనలకు మరింత భరోసాను ఇచ్చిందని వారు వ్యాఖ్యానించారు. అయితే, సూర్యుని కాస్మిక్ కిరణాలు చంద్రుని ఉపరితలాన్ని తీక్షణంగా తాకడం, చంద్రునిపై ఉన్న బలహీన మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ తదితర అంశాలు చందమామపై ఆవాసాల ఏర్పాటుకు కొత్త సవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటిని కూడా ఎదురుకోవడానికి రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తయారీలో శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలై ఉన్నారు.   
యూరప్ ప్రభుత్వం మూన్ 20-20, మూన్ 20-30 పేరిట ప్రయోగాలను ప్రారంభిస్తే, అమెరికా 2020 సంవత్సరంలో  మరోమారు మానవుడిని చంద్రునిపైకి పంపి అక్కడి వనరులను, ఖనిజ నిక్షేపాల సమాచారాన్ని రాబట్టి 2025, 2030  సంవత్సరంలోగా అక్కడ కాలనీలను ఏర్పాటు చేసి అక్కడి నుండే పరిశోదనలను సాగించాలని యోచిస్తుంది. మన భారత దేశం సైతం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన డీప్ స్పేస్ నెట్‌వర్క్ సహకారం తీసుకొంటూ చంద్రుని దక్షిణ ప్రాంతంలోని పదార్థాల స్వభావం, నీటి లభ్యత వంటి పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్ – 2 ప్రయోగాన్ని 2017 చివర్లో గానీ, 2018 మొదట్లో గానీ ప్రయోగించుటకు సంసిద్దమవుతుంది.దీని ద్వారా చంద్రుని పై జరిగే లేటెస్ట్ న్యూస్ క్షణాల్లో తెలిసే వీలుంది. శాస్త్రవేత్తల పరిశోదనలు సరైన ఫలితాలనిస్తుండటంతో త్వరలోనే చంద్రునిపై ఇల్లు కట్టుకొనే ఆలోచనలో కొందరుంటే, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని సంస్థలు చంద్రునిపై ప్లాట్ల అమ్మకాన్ని ప్రారంభించడం విశేషం.




చందమామ గురించి ఆసక్తికర విశేషాలు :
చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు!
చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి, నీరు లేకపోవడమే. అవి రెండూ ఉన్నట్లయితే, అక్కడి మట్టి కదిలేది! కాలి ముద్రలు చెరిగిపోయేవి. జాబిల్లిపై నిరంతరం అతిసూక్ష్మస్థాయిలోని ఉల్కారేణువులు కురుస్తూనే ఉన్నా.. అవి పేరుకుపోయి అడుగు జాడలు చెరిగిపోవడం ఇప్పట్లో జరగదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
చంద్రునిపై మచ్చలు కనబడటానికి కారణం !
చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. అయస్కాంత క్షేత్ర  బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని శిలలు నల్లగాను, సూర్యుడి నుండి వచ్చే వేడి గాలులవల్ల ప్రభావితం చెందిన అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగానూ కనిపిస్తాయి.
భూమికి దూరం అవుతున్న చంద్రుడు :
ప్రతీ సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెం. మీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోదనల్లో తేలింది. ఇది ఇలాగే కొనసాగితే, భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత  47 రోజులు తీసుకుంటాడంటా!
ఇక్కడ 60 కిలోల మనిషి, చంద్రుడిపై 10 కిలోలే!  :
భూమితో పోలిస్తే చంద్రుని పై నుండి రాకెట్లను అంతరిక్షంలోకి పంపడం చాలా చౌక. దీనికి కారణం లేకపోలేదు. భూమి గురుత్వాకర్షణ శక్తి ఆరు వంతులుగా అనుకుంటే, చంద్రుని ఆకర్షణ శక్తి ఒక వంతుకన్నా తక్కువ. అంటే, భూమి పైన అరవై కిలోలున్న మనిషి, చంద్రునిపై పది కిలోలు మాత్రమే తూగుతాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇందనం, దాని వ్యయం తగ్గుతున్నట్లే కదా! 

For telugu news online please Download NewsDistill app from Google play store

No comments:

Post a Comment