Monday 6 June 2016

కొలువులంటూ కోతలు - మారుతున్న రాతలు



కళాశాల జీవితం ముగియకముందే ఒక చేతిలో కొలువు, మరో చేతిలో స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణ కూడగట్టుకొని ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనే ఉత్సాహం విద్యార్తికైనా ఉంటుంది. కానీ, గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు భారత దేశ టెక్నాలజీ, మేనేజ్మెంట్ విద్యార్థులనే గాక, పరిశ్రమ వర్గాలను, కళాశాల యాజమాన్యాలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం ప్రాంగణ నియామకాల ద్వారా ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్న ఫ్లిప్కార్ట్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ తదితర సంస్థలు ఏవేవో కారణాలు చెప్పి తమ సంస్థల్లో చేర్చుకొనే తేదీని పొడగించడమో, విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు కొరవడడం వల్ల వారి ఆఫర్ ను నిరాకరిస్తున్నామానో చెబుతుండటం అందరినీ కలవరపరుస్తుంది.

ఫ్లిప్కార్ట్ ఇలా - ఎల్అండ్టీ అలా :
కంపెనీ అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ నేపథ్యం మూలంగా అభ్యర్థుల చేరికను జూన్ మాసం నుండి డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్లు, అందుకు గానూ ఎంపికైన విద్యార్థులకు జాయినింగ్ బోనస్ గా లక్షా యాభై వేల రూపాయలను పరిహారంగా ఉద్యోగంలో చేరే సమయంలో చెల్లిస్తామని ఫ్లిప్కార్ట్ వివరణ ఇచ్చి కొత్త వివాదానికి తెరలేపిన ఘటన మరువకముందే, తాజాగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ దేశవ్యాప్తంగా వివిధ కాలేజీలకు చెందిన దాదాపు వెయ్యి నుండి 1500 మంది విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దుచేయడం వచ్చిన  లేటెస్ట్ అప్డేట్  అందర్నీ అయోమయంలో పడవేసింది. చేతిలో ఉద్యోగం ఉంది కదా అన్న నమ్మకంతో వేరే ప్రయత్నాలు చేయని విద్యార్థులు కొందరైతే, ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోడానికి ఎడ్యుకేషన్ లోన్లను తీసుకొని ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుదామా? అని ఆశగా చూస్తున్న వారు మరికొందరు. అందరి ఆశలపై నీళ్ళు చల్లుతూ చావు కబురు చల్లగా చెప్పిన సదరు కంపెనీలపై ఐఐటీ, ఐఐఎం వంటి అత్యున్నత స్థాయి సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులతో పాటు, ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాల విద్యార్థి లోకం, పారిశ్రామిక వేత్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఫ్లిప్కార్ట్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సంస్థలతో పాటు హోప్స్కోచ్ ,ఇన్మొబీ, కార్దేఖో మొదలగు సంస్థలు కూడా అభ్యర్థుల చేరిక తేదీని వాయిదా వేసిన/ తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయని కొందరి విద్యార్థుల ద్వారా బ్రేకింగ్ న్యూస్ తెలుస్తున్నది.

తెరవెనుక జరిగిన కథ :
విద్యార్థుల ఉద్యోగ జాయినింగ్ డేట్ ను పొడగించుటకు వ్యాపార పునర్వ్యవస్థీకరణే కారణమని చెప్తున్న ఫ్లిప్కార్ట్, సరైన నైపుణ్యాలు లేవని సాకుతో విద్యార్థులకు ఇదివరకే ఇచ్చిన ఆఫర్ లెటర్ లను క్యాన్సల్ చేసిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కంపెనీలు చెప్తున్న కారణాలు నిజానికి సరైనవి కాదనే భావన అందరిలో వ్యక్తమవుతుంది. ఆన్ లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ గత సంవత్సరం మార్చి 29 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫ్లిప్కార్ట్ లాంటి భారత కామర్స్ బిజినెస్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అప్పటివరకూ ఫ్లిప్కార్ట్ కంపెనీ అధికంగా ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ ను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక గత దీపావళి సీజన్లో సదరు సంస్థ తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. గత నవంబర్ తో పోలిస్తే మార్చిలో కంపెనీ ఆదాయం భారీగా పడిపోయింది. మరి అమెజాన్ లాంటి ప్రపంచ స్థాయి కామర్స్ కంపెనీ ని తట్టుకుని మార్కెట్లో నిలబడాలంటే పెట్టుబడులను పెద్ద ఎత్తున సేకరించక తప్పని పరిస్థితి ఫ్లిప్కార్ట్ కి దాపురించింది. ప్రయత్నంలో 15 బిలియన్ డాలర్ల కోసం ఆరు నెలల కాలంలో ఫ్లిప్ కార్డ్ దాదాపు 15 మందికి పైగా పెట్టుబడిదారులతో మంతనాలు జరిపినా కేవలం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే సమకూర్చుకోగలిగింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అప్పటికే భారీ నష్టాలను నమోదు చేసిన సంస్థ కొత్తగా సుమారు ఇరవై లక్షల వార్షిక వేతనాలతో కొత్త ఉద్యోగులను తీసుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే, వేతన వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే విద్యార్థులను సంస్థలోకి తీసుకోకుండా ఫ్లిప్కార్ట్ జాప్యం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కంపెనీ ఎంతో ఆర్భాటంగా వివిధ దశల్లో నియామక పరీక్షలను విద్యార్థులకు ఏడాదిన్నర క్రితమే నిర్వహించి ఆఫర్ లెటర్లను సైతం ఇచ్చాక తీరా ఇప్పుడు లేదు పోమ్మనడానికి కారణం నిర్దేశిత లక్ష్యాలను సదరు కంపెనీ అందుకోకపోవడమే అని తెలుస్తుంది. 2015 సంవత్సరం మొదట్లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఆయా కళాశాల విద్యార్థులను ఎంచుకునే సమయాన మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్, సాంకేతిక విభాగాల వింగ్ కోసం ఉద్యోగార్థుల నుండి దరఖాస్తులను ఆశించింది. అయితే, అనూహ్యంగా మారిన మార్కెట్ ముఖచిత్రంతో కంపెనీ తగిన అంచనాలను అందుకోలేక నష్టనివారణ చర్యలను పూడ్చుకోవడానికి విద్యార్థులను తిరస్కరించక తప్పలేదు. పైకి నైపుణ్యాల లేమి అనే వంకతో విద్యార్థులను వద్దంటున్న కంపెనీ నిజానికి తన వ్యూహం బెడిసికొట్టగానే పనికి పూనుకుందని నిపుణులు అంటున్నారు.
ఏది ఏమైనా పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. ఉద్యోగం ఉంది కదా అన్నధీమాతో వేరే ప్రయత్నాలు ఏమీ చేయని వాళ్లు కొందరైతే, ఒకసారి ఒక కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందంటే, మరో కంపెనీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకు వెళ్లడానికి వీల్లేదని తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గట్టి నిబందనలకు లోబడి ఆగిపోయిన వారు మరికొందరు! ఇలా ఏంతో మంది విద్యార్థులు.. ముందస్తు వ్యూహాలు లేకుండా ప్రచార ఆర్భాటాల కోసమో, పేరుకోసమో తొందరపడే ఇటువంటి కంపెనీల చేతిల్లో విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా బహుళజాతి సంస్థలు తమ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నియామకాలను చేపడితే ఇటువంటి నష్ట నివారణ చర్యలకు ప్రాకులడటం అనేది ఉండదు. తద్వారా వారి కంపెనీ గౌరవం, పేరు కాస్తైన కాపాడుకున్న వారవుతారు.
అభ్యర్థుల చేరికను ఆరు నెలలుగా పొడగిస్తున్న మరికొన్ని కంపెనీలు :
  • ఇన్మోబి
  • హాప్స్కాట్
  • రోడ్ రన్నర్
  • క్లిక్ ల్యాబ్స్ 

No comments:

Post a Comment